Monday 25 November 2019

బంగారు గుడ్డుపెట్టే బాతు

అనగనగా వెంకయ్యపాలెం అనే ఊరిలో రంగమ్మ, అంజయ్య అనే దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు. వారికి ఒకరోజు బాతు మాంసం తినాలి అని ఆశకలిగింది. ఆరోజు వారి యాజమాని వారికి జీతాలు ఇచ్చే రోజు కాబట్టి అంజయ్య సంతకు వెళ్లి ఒక బాతుని కొనుక్కుని వచ్చాడు.

రంగమ్మ అంజయ్య దానిని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా అంజయ్య దానిని చంపడానికి కత్తి ఎత్తగానే బాతు మాట్లాడటం మొదలెట్టింది. "అంజయ్య ... అంజయ్య... నన్ను చంపకు నేను బంగారు గుడ్లు పెట్టే బాతుని" అని అంది.

ఇక నోరెళ్ల బెట్టడం అంజయ్య వంతయ్యింది. పక్కనే ఉన్న రంగమ్మ "ఇదేంటి బాతు మాట్లాడుతుంది ఇంకా ఇది బంగారు గుడ్లు కూడా పెడుతుందట ఎంత ఆశ్చర్యం" అంది.

 అప్పుడు అంజయ్య బాతుతో "ఒకవేళ నువ్వు బంగారు గుడ్లు పెట్టకపోతే?" అన్నాడు. "పెట్టకపోతే నన్ను చంపెయ్యి రంగయ్య అంది బాతు. సరే నీకు రేపటి వరకు గడువు ఇస్తున్నా ఈ లోగా నువ్వు బంగారు గుడ్డు పెట్టకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి బాతుని బుట్టకింద వేసి అక్కడనించి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయం బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. అంజయ్య దానిని సంతలో అమ్మి డబ్బుని రంగమ్మకి ఇస్తాడు. ఇలా రోజు బాతు బంగారు గుడ్డు పెట్టడం అంజయ్య దానిని అమ్మటం జరుగుతూ ఉంది. బాతు పెట్టే బంగారు గుడ్లవల్ల వాళ్ళు చాలా తక్కువ సమయంలో ధనవంతులు అవుతారు.

ఇది ఇలా ఉండగా ఒకరోజు రంగమ్మ అంజయ్యతో ఎన్ని రోజులు అని ఒక్కో గుడ్డు అమ్ముతాము ఆ బాతు పొట్టలో ఒక పెద్ద బంగారు గని ఉందేమో... మనము దానికి కోసి దాని పొట్టలో ఉన్న బంగారాన్ని అంతా ఒకేసారి తీసేసుకుందాము అని సలహా ఇచ్చింది.

అమాయకుడైన అంజయ్యకు రంగమ్మ మాటలు బాగా నచ్చి బాతుని చంపేస్తాడు. బాతు చచ్చిపోయింది కానీ దాని పొట్టలో బంగారం లేదు. తాము ఏమి కోల్పోయామో తెలుసుకున్న ఆ భార్యభర్తలు ఏడుస్తూ కూర్చున్నారు.

నీతి: అత్యాశ అనర్ధానికి దారి తీస్తుంది


Thursday 21 November 2019

తాబేలు కష్టాలు

అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. చిన్నప్పట్నుంచి అది సముద్రం లో ఈదుతూ నేలపై అటూఇటూ తిరుగుతూ నచ్చిన సముద్రపు నాచు, భూమి పైన చిన్న చిన్న మొక్కలు తింటూ సంతోషంగా కాలం గడిపేది. 

దాని వీపుపై ఉండే డొప్ప దానికి నచ్చేది కాదు. దాని వాల్ల తాను అందవిహీనంగా ఉన్నాను అని బాధ పడేది. అసలు తాను మెల్లిగా నడవటానికి ఆ డొప్ప తన కాళ్లకు అడ్డు రావటమే కారణం అనుకునేది. అదే అడవిలో ఉండే జంతువులు ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా తాబేలు అందంగానే ఉంది అని నచ్చ చెప్పినా తాబేలు వినేది కాదు. 


ఒకరోజు చిన్న మొక్కలు తింటూ మెల్లిగా ఒక ఎతైన గుట్ట మీదకు ఎక్కేసింది అందని ఆకుల కోసం ప్రయత్నిస్తూ కిందకి జారిపడిపోయింది. ఆ పడటంపడటం తిరగపడింది. ఎంత ప్రయత్నించినా తనను తాను తిప్పుకోలేకపోయింది. ఆ రోజు బయట మంచి ఎండ కాస్తుంది. ఆ వేడికి తట్టుకోలేక తాబేలు ఇంకా ఆఖరి ప్రయత్నం అనుకుని గట్టిగా ప్రయత్నించింది, ఈ సారి దాని ప్రయత్నం ఫలించి మాములుగా నడిచే వైపుకు తిరగగలిగింది. 


హమ్మా... అంతా తన వీపు పైన వున్నా డొప్ప వల్లే అని ఇంకా కోపం పెంచుకుంది. 
ఇదిలా ఉండగా ఎక్కడో ఆలోచిస్తున్న తాబేలు వైపుకు ఒక గ్రద్ద దానిని తినటానికి విసురుగా వచ్చింది.  వెంటనే ఈ లోకాలోనికి వచ్చిన మన తాబేలు చటుక్కున దాని డొప్పలో దాక్కుంది. 


"అబ్భా.. ఈ రోజు నాకు ఈడొప్ప లేకపోతే గ్రద్ద నన్ను చంపేసేదే" అని గ్రహించింది. ఇంకెప్పుడు తన డొప్ప గురించి చెడ్డగా ఆలోచించ లేదు, తన రూపం గురించి ఎప్పుడు బాధపడలేదు. 

Tuesday 19 November 2019

రెండు పిల్లుల పోట్లాట


అనగనగా ఒక ఊర్లో రెండు పిల్లులు ఉండేవి. అవి ఒక దానికి ఇంకోటి సహాయం చేసుకుంటూ  వేటాడడంతో వచ్చిన వేటను సునాయాసంగా సంపాదించేవి. తరువాత వేటను పంచుకునేవి. 

ఇది ఇలా ఉండగా ఒక రోజు రెండు పిల్లులు ఒక చిల్లర కొట్టులో ప్రవేశించాయి. యజమానిని ఒక పిల్లి దృష్టి మళ్లిస్తే ఇంకోటి చేకచక్యంగా ఒక రొట్టెను కొట్టులోనుంచి బయటకు తీసుకెళ్లింది. ఆ పిల్లి నోట్లో రొట్టెను చూసి యజమాని దగ్గర ఉన్న పిల్లి పారిపోయినట్లు నటించింది. కొంత దూరం వెళ్లాక సహాయం చేసిన పిల్లి, రొట్టె నోట్లో ఉన్న పిల్లితో ఇంకా చాలు మనం పంచుకుందాం అంది. మొదటి పిల్లి సరే అని రెండు ముక్కలు చేసింది, అందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చింది. అయితే పెద్ద ముక్క తనకి కావాలి అని మొదటి పిల్లి లేదు నాకే కావాలి అని రెండో పిల్లి పోట్లాడుకోవటం మొదలెట్టాయి. 

వీటి పోట్లాట బాగా ఉండటంతో వచ్చేపోయేవారు చూడటం జరిగింది అందరూ పిల్లులను పట్టించుకోకుండా వదిలేశారు అయితే అటుగా వెళ్తున్న ఒక కోతి మాత్రం వాటి మధ్య న్యాయం చేస్తాను అంటూ కూర్చుంది. 

మొదటి పిల్లి "అయ్యా ... మేము ఈరొట్టెను సంపాదించటానికి సమానంగా కష్టపడ్డాము  అయితే ఈ పిల్లి రొట్టె వాటాలు సరిగ్గా వేయటం లేదు.. తనకు పెద్ద ముక్క కావాలని పేచీపెడుతుంది అని చెప్పింది"
రెండో పిల్లి "రొట్టె తెచ్చింది నేను నాకు పెద్ద ముక్క కావాలి అని అంది"
అందుకు కోతి రెండు ముక్కల్ని తన చేతి లోనికి తీసుకుని మీరు ఇద్దరు సమానంగా పంచుకోవటమే న్యాయం. 
అయితే ఈ పెద్ద ముక్క కాస్త ఎక్కువ పెద్దగా వుందే అని దాన్ని కొంచం కొరికింది. 


అరే ఇప్పుడు చిన్న ముక్క పెద్దదయ్యిందే అంటూ ఇంకో రొట్టె ముక్కను కొరికింది. 
అయ్యో ఇప్పుడు మొదటి రొట్టె ముక్క పెద్దదిగా వుంది అంటూ దాన్ని కొరికింది. 
మొత్తానికి రెండు ముక్కలు నోట్లో పెట్టుకుని ఒక్క జంప్ చేసి వాటి మధ్యనుంచి ఎగిరి చెట్టు ఎక్కేసింది
ఇదంతా చూస్తున్న పిల్లులు నోరెళ్ళ బెట్టాయి...  ఇప్పుడు పిల్లులు ఈ రోజుకు మళ్ళీ వేటాడాలి తమ తిండి కోసం. 
చూసారా.. మనలో మనం గొడవ పడితే తర్వాత వచ్చే నష్టాన్ని మనమే భరించాలి. 

మంచి స్నేహితుడు


చాలాకాలం క్రితం పశ్చిమ దుబాయ్ నగరంలో అసీం, అనుమ్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. చిన్నతనంలో ఎంతో ఆడుతూపాడుతూ జీవించారు. అసీం వాళ్ళ నాన్న ధనవంతుడు. ఆ ఊరిలో ఉన్న ధనవంతుల జాబితా లో మొదటి వాడు. ఇలా ఉండగా అనుమ్ వాళ్ళ నాన్న మధ్యతరగతి వాడు. 


చిన్నప్పట్నుంచి అడిగినవన్నీ దొరకటంతో అసీం మొండితనం, తొందరబాటు స్వభావంతో పెరిగాడు. ఇటు అనుమ్ జీవితం లో కష్టాలను ఎదురుకుంటూ నెమ్మదిని, అనుకువను నేర్చుకున్నాడు.

వాళ్లిదరు కొంచెం పెద్దవాళ్ళు అవడంతో వాళ్ళ ఇంట్లోవారిని అడిగి షార్జా నగరానికి బయల్దేరారు. వెళ్లే దారిలో వారికి పేచీ మొదలయ్యింది, ఒకరితో ఒకరు వాదించునేటప్పుడు అసీం అనుమ్ ని చెంప మీద కొట్టాడు. 

అనుమ్ తిరిగి మాట్లాడకుండా ఎడారి ఇసుక మీద నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాశాడు. రాసిన వెంటనే ఇసుకలో కాబట్టి వెంటనే చెరిగిపోయింది. 


కొంత దూరం మౌనంగా సాగింది ప్రయాణం. అనుమ్ ఒకచోట ఇసుకలో కూరుకుపోతున్నాడు అసీం గమనించి అనుమ్ ని పైకి లాగి అతని ప్రాణాన్ని రక్షించాడు. వెంటనే అనుమ్ అసీంకు కృతజ్ఞతలు చెప్పాడు. 

ఇంకా కొంతం దూరం నడిచినప్పుడు ఒక కొండ కనబడింది వారికి. అనుమ్ ఒక చిన్న రాయితో కొండ మీద ఉన్న ఒక పెద్ద రాతి బండ మీద నా స్నేహితుడు నా ప్రాణం కాపాడాడు అని రాసాడు. 


అంతా గమనించిన అసీం అనుమ్ ని ఎందుకు ఇసుక మీద చెడ్డ విషయం రాతి మీద మంచి విషయం రాశాడో అడిగాడు. అందుకు అనుమ్ మన జీవితంలో మంచిని మాత్రమే గుర్తుంచుకుని చెడుని మర్చిపోతే ఎప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది మిత్రమా... నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన విషయం నేను ఎప్పటికి మరిచిపోకూడదు అని బండ మీద రాసాను, నువ్వు నన్ను కొట్టిన విషయం నాకు ఎప్పటికి గుర్తుకు రాకూడదు అని ఇసుక మీద రాశాను అని చెప్పాడు. 

అసీం అనుమ్ ని కౌగిలించుని తనకి ఒక పాఠం నేర్పినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. 



Sunday 17 November 2019

కలిసి ఉండటమే గొప్ప బలం

అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. పిల్లలను చిన్నపట్నుంచి ఎంతో గారాభంగా పెంచాడు. అందరూ పెరిగి పెద్దయ్యి తనకు పొలం పనుల్లో సహాయంగా ఉంటారు అని ఆ రైతు ఎంతో ఆశ పెట్టుకున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడు ఒకరితో ఒకరు నిరంతరం పోట్లాడుకునేవారు. ఎంతగా అంటే ఇల్లంతా గోలగోలగా ఉండేలాగా.

సమయం ఇట్టే గడిచిపోయింది, పిల్లలు పెద్దయినా ఇంకా తండ్రి బాధ్యతను తీసుకోకపోవడం వల్ల, తండ్రి ఒక్కడే పొలంలో పని చెయ్యటంవల్ల రైతు నీరసించిపోయాడు. సంవత్సరాలు దొర్లిపోయాయి. ఒక రోజు రైతుకి జబ్బు చేసింది, మంచం పట్టాడు. పిల్లలని పిలిచి తలో పని చెప్పి పొలానికి పంపాడు.
కొంచం సేపట్లోనే వాదులాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు పిల్లలు. ఇలాగే ఉంటే తనకి ఏమైనా అయితే తన పిల్లలను ఎవరు చూసుకోరని బాధపడ్డాడు రైతు. అతనికి ఒక ఉపాయం తట్టింది.పెద్దవాడిని పిలిచి మూడు కట్టెపుల్లలను తీసుకురమ్మన్నాడు. తీస్కుని వచ్చాక మూడింటిని మోపుగా కట్టి పిల్లలను ఒక్కొక్కరిగా విరవమన్నాడు. అందరూ ఒకరి తరువాత ఒకరు ప్రయత్నించారు కానీ ఒక్కరు కూడా విరగగొట్టలేకపోయారు.
ఇప్పుడు కట్టె పుల్లలను విప్పి ఒక్కో కట్టెపుల్ల ఒక్కో కొడుక్కి ఇచ్చి విరగొట్టమన్నాడు. చాల సునాయాసంగా విరిచేసారు పిల్లలు.
ఇప్పుడు రైతు ఆయన కొడుకులను చూస్తూ "మీరు ముగ్గురు కలిసి ఉండి పని చేస్తే ఎవరూ మిమ్మల్ని ఏమి చెయ్యలేరు.. మీరు ఒక్కక్కరు గా విడివిడి గా ఉంటే ప్రతి బయటి వ్యక్తి మిమ్మల్ని సునాయాసంగా గెలవగలడు, మోసం చెయ్యగలడు" అని చెప్పాడు.

ఆ రోజు నించి రైతు ముగ్గురు కొడుకులు ఎంతో కలిసి మెలిసి ఉండసాగారు.

Friday 15 November 2019

భుక్తాయాస నంబూద్రి


కేరళ లో పూజారులను నంబూద్రి అంటారు. అయితే ఒకానొక రోజున ఒక ఊర్లో ఒక తిండిపోతు నంబూద్రి ఉండేవాడు. ఆ ఊరి పెద్ద, కొడుకు పెళ్లి ఘనంగా జరిపించాడు. అదే ఊర్లో ఉండే మన నంబూద్రికి కూడా ఆహ్వానం వచ్చింది. పట్టు పంచె ధోవతితో మన నంబూద్రి పొట్ట నిమురుకుంటూ పెళ్లి భోజనానికి వెళ్ళాడు.


అనేక రకాల పిండివంటలు, చిత్రాన్నాలు, దోశలు, జిలేబీ, అరటిపండులు, ఇలా ఎన్నో రకాలు వడ్డించారు. చాలా రకాలు ఉండటంతో మనవాడు చాలానే తిన్నాడు.


తినలేక అవస్థపడుతూ అటూ ఇటూ కదులుతూ పొట్టలో ఖాళీ చేసుకుంటున్నాడు. మళ్లీ ఇంకొన్ని జిలేబిలు తిని హమ్మా అని అనుకున్నాడు ఎదో విధంగా లేచి రెండు అడుగులు వేశాడో లేదో అమ్మో...  అయ్యో..  అని తెగ బాధపడిపోతున్నాడు. అతని బాధని చూస్తున్న పక్కనే నడుస్తున్న వ్యక్తులు మన నంబూద్రిని చూసి నవ్వుతున్నారు. 


అంతలో పక్కనున్న అదే ఊరు ఆయన అంత ఆపసోపాలు పడుతూ నడవకపోతే, నీ నోట్లో వేలు పెట్టి కక్కేయొచ్చుకదా అన్నాడు. అందుకు మన నంబూద్రి వేలు దూరేంత ఖాళీ ఉంటే ఇంకో అరటిపండే తినే వాడిని కదా అన్నాడంట!!

చూసారా పిల్లలు నంబూద్రి కథ చాలా సరదాగా ఉంది కాదు.



Thursday 9 May 2019

తాటి చెట్టు గర్వం అనిచిన మర్రి చెట్టు


ఆనగనగా ఒక ఊర్లో ఒక తాటి చెట్టు ఉంది. దానికి అన్నింటికన్నా తనే పొడవైన్దాన్ని అని పొగరు. ఎంతమంది ఏమి చెప్పినా తన గొప్పలతో అందరినీ విసిగించేది. అది నిండు వేసవి కాలం, ఒక రోజు ఒక కాకి మర్రి కాయని పట్టుకొచ్చి తాటిచెట్టు మీద కూర్చుని తినటం ప్రారంబించింది ఒక మర్రి గింజ దొర్లుకుంటూ వెళ్లి తాటి చెట్టు మట్టలమధ్య ఇరుక్కుంది.

అంతే ఆవ గింజ అంత వున్న మర్రి గింజని చూసి తాటి చెట్టు వెటకారం గా పక్కున నవ్వింది. ఇంత చిన్న దానివి నువ్వేం చెయ్య గలవని ఎగతాళి చేసింది. మర్రి గింజ బిక్కు బిక్కు మంటూ ఒక రాత్రంతా అలాగే వుంది పోదున్నే ముసుర్లు పట్టాయి జోరున వర్షం కురవసాగింది వర్షానికి మర్రి  గింజ మొలకెత్తింది చూస్తుండగానే తన వేళ్లు తాటి కొమ్మలమధ్య బలం గా దిగసాగాయి. కొన్నాళ్ళకి మర్రి చెట్టు బలంగా ఏపుగా ఎదగ సాగింది. మర్రి చెట్టు ఎదుగుతూ ఉంటే తాటి చెట్టు వయసు పెరుగుతూ, మర్రి చెట్టు తన సారం తీస్కుంటూ  ఉండటం వలన క్షీణించి పోయింది. అది చనిపోయేప్పుడు అనుకుంది కదా "ఈ చిన్న మర్రి విత్తనం ఇంత పెద్ద మహా వృక్షం అయిపోయింది. నేను ఎంతో పెద్దగా ఉండేదాన్నో ఇప్పడు నేను దీని ముందు తల దించుకోవాల్సివస్తుంది." అని

నీతి: మన స్నేహితుల్లో కొంతమంది ఏమీ చెయ్యలేక ఉంటే వారిని కించపరచ కూడదు. ఇప్పుడు వారు చెయ్యలేక పోవచ్చు భవిష్యత్తులో వారు విజయం సాధిస్తే మనం వారిని ఎలా ఎదుర్కుంటాము ఆలోచించండి .