Sunday 17 November 2019

కలిసి ఉండటమే గొప్ప బలం

అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. పిల్లలను చిన్నపట్నుంచి ఎంతో గారాభంగా పెంచాడు. అందరూ పెరిగి పెద్దయ్యి తనకు పొలం పనుల్లో సహాయంగా ఉంటారు అని ఆ రైతు ఎంతో ఆశ పెట్టుకున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడు ఒకరితో ఒకరు నిరంతరం పోట్లాడుకునేవారు. ఎంతగా అంటే ఇల్లంతా గోలగోలగా ఉండేలాగా.

సమయం ఇట్టే గడిచిపోయింది, పిల్లలు పెద్దయినా ఇంకా తండ్రి బాధ్యతను తీసుకోకపోవడం వల్ల, తండ్రి ఒక్కడే పొలంలో పని చెయ్యటంవల్ల రైతు నీరసించిపోయాడు. సంవత్సరాలు దొర్లిపోయాయి. ఒక రోజు రైతుకి జబ్బు చేసింది, మంచం పట్టాడు. పిల్లలని పిలిచి తలో పని చెప్పి పొలానికి పంపాడు.
కొంచం సేపట్లోనే వాదులాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు పిల్లలు. ఇలాగే ఉంటే తనకి ఏమైనా అయితే తన పిల్లలను ఎవరు చూసుకోరని బాధపడ్డాడు రైతు. అతనికి ఒక ఉపాయం తట్టింది.పెద్దవాడిని పిలిచి మూడు కట్టెపుల్లలను తీసుకురమ్మన్నాడు. తీస్కుని వచ్చాక మూడింటిని మోపుగా కట్టి పిల్లలను ఒక్కొక్కరిగా విరవమన్నాడు. అందరూ ఒకరి తరువాత ఒకరు ప్రయత్నించారు కానీ ఒక్కరు కూడా విరగగొట్టలేకపోయారు.
ఇప్పుడు కట్టె పుల్లలను విప్పి ఒక్కో కట్టెపుల్ల ఒక్కో కొడుక్కి ఇచ్చి విరగొట్టమన్నాడు. చాల సునాయాసంగా విరిచేసారు పిల్లలు.
ఇప్పుడు రైతు ఆయన కొడుకులను చూస్తూ "మీరు ముగ్గురు కలిసి ఉండి పని చేస్తే ఎవరూ మిమ్మల్ని ఏమి చెయ్యలేరు.. మీరు ఒక్కక్కరు గా విడివిడి గా ఉంటే ప్రతి బయటి వ్యక్తి మిమ్మల్ని సునాయాసంగా గెలవగలడు, మోసం చెయ్యగలడు" అని చెప్పాడు.

ఆ రోజు నించి రైతు ముగ్గురు కొడుకులు ఎంతో కలిసి మెలిసి ఉండసాగారు.

No comments:

Post a Comment