Monday 25 November 2019

బంగారు గుడ్డుపెట్టే బాతు

అనగనగా వెంకయ్యపాలెం అనే ఊరిలో రంగమ్మ, అంజయ్య అనే దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు. వారికి ఒకరోజు బాతు మాంసం తినాలి అని ఆశకలిగింది. ఆరోజు వారి యాజమాని వారికి జీతాలు ఇచ్చే రోజు కాబట్టి అంజయ్య సంతకు వెళ్లి ఒక బాతుని కొనుక్కుని వచ్చాడు.

రంగమ్మ అంజయ్య దానిని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా అంజయ్య దానిని చంపడానికి కత్తి ఎత్తగానే బాతు మాట్లాడటం మొదలెట్టింది. "అంజయ్య ... అంజయ్య... నన్ను చంపకు నేను బంగారు గుడ్లు పెట్టే బాతుని" అని అంది.

ఇక నోరెళ్ల బెట్టడం అంజయ్య వంతయ్యింది. పక్కనే ఉన్న రంగమ్మ "ఇదేంటి బాతు మాట్లాడుతుంది ఇంకా ఇది బంగారు గుడ్లు కూడా పెడుతుందట ఎంత ఆశ్చర్యం" అంది.

 అప్పుడు అంజయ్య బాతుతో "ఒకవేళ నువ్వు బంగారు గుడ్లు పెట్టకపోతే?" అన్నాడు. "పెట్టకపోతే నన్ను చంపెయ్యి రంగయ్య అంది బాతు. సరే నీకు రేపటి వరకు గడువు ఇస్తున్నా ఈ లోగా నువ్వు బంగారు గుడ్డు పెట్టకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి బాతుని బుట్టకింద వేసి అక్కడనించి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయం బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. అంజయ్య దానిని సంతలో అమ్మి డబ్బుని రంగమ్మకి ఇస్తాడు. ఇలా రోజు బాతు బంగారు గుడ్డు పెట్టడం అంజయ్య దానిని అమ్మటం జరుగుతూ ఉంది. బాతు పెట్టే బంగారు గుడ్లవల్ల వాళ్ళు చాలా తక్కువ సమయంలో ధనవంతులు అవుతారు.

ఇది ఇలా ఉండగా ఒకరోజు రంగమ్మ అంజయ్యతో ఎన్ని రోజులు అని ఒక్కో గుడ్డు అమ్ముతాము ఆ బాతు పొట్టలో ఒక పెద్ద బంగారు గని ఉందేమో... మనము దానికి కోసి దాని పొట్టలో ఉన్న బంగారాన్ని అంతా ఒకేసారి తీసేసుకుందాము అని సలహా ఇచ్చింది.

అమాయకుడైన అంజయ్యకు రంగమ్మ మాటలు బాగా నచ్చి బాతుని చంపేస్తాడు. బాతు చచ్చిపోయింది కానీ దాని పొట్టలో బంగారం లేదు. తాము ఏమి కోల్పోయామో తెలుసుకున్న ఆ భార్యభర్తలు ఏడుస్తూ కూర్చున్నారు.

నీతి: అత్యాశ అనర్ధానికి దారి తీస్తుంది


No comments:

Post a Comment