Monday 22 April 2013

తప్పించుకుపోయింది తాబేలు బుర్ర


అనగనగా ఒక నక్క. ఆ నక్క ఒకరోజు నీరు తాగటానికి కొలనుకి వెళ్ళింది. నీళ్ళు తాగుతుండగా దానికి ఒడ్డునొక తాబేలు దొరికింది. ఈరోజుకు ఆకలి తీరింది అని దానిని పట్టుకుంది. నక్క పట్టుకొంగానే తాబేలు దాని డొప్ప లోపలికి ముడుచుకుపోయింది. నక్కకి దానిని ఎలా తినాలో అర్ధం కాలేదు అటుఇటు కొట్టింది లోపలనుంచి తాబేలు రాలేదు. 
అప్పుడు తాబేలు నక్కతో "నేను చాలా సేపట్నుంచి వొడ్డున వుండటం మూలంగా నా చర్మం ఎండిపోయి గట్టిగా మారింది నువ్వు నన్ను కొద్దిసేపు చెరువులో నానపెడితే మళ్ళీ మెత్తగా అవుతాను అప్పుడు హాయిగా తినొచ్చు" అని చెప్పింది 

అప్పటికే దానిని ఎలా బయటికి రాప్పించాలోఅని శతవిధాలా ప్రయత్నించిన నక్క విసుగుతో తాబేలు ఆలోచనే మంచిదని దానిని చెరువులోకి తీసుకువెళ్ళి పారిపోకుండా కాలు దాని మీద పెట్టింది. 
కొంత సేపటికి నక్క తాబేలుతో "నానావా" అని అడిగింది. 
దానికి తాబేలు "అంతా మెత్తగా నానాను కానీ నీ కాలు కింద మాత్రం ఇంకా గట్టిగా వున్నాను" అంది 
ఆలోచన లేని నక్క నిజమే కదా అని కాలు తీసింది.  
ఇంకేముంది తాబేలు నీళ్ళ లోతుకి చటుక్కున జారిపోయింది. 
నీతి:
ఉపాయం వుంటే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడొచ్చు. 

Wednesday 27 February 2013

కాకి-రొట్టె ముక్క

కాకి రొట్టె ముక్క 

అనగనగా ఒక కాకి. ఆకాకికి  ఒక రొట్టె ముక్క దొరికింది. హాయిగా చెట్టు మీద కూర్చుని తింటుంది. అంతలో అక్కడకి ఒక నక్క వచ్చింది. నక్క అటువైపుకి రావటం చూసి కాకి రొట్టెని నోట కరచుకుని పారిపోతానికి ప్రయత్నించింది.\


అంతలో నక్క "కాకి బావ...  కాకి బావ...  నీ గొంతెంత మధురం" అంది కుయిక్తితో. 
కాకి పారిపోయేది కాస్త పొగడ్తకి కరిగి అలాగే చూస్తుండి పోయింది. 
నక్క మళ్లీ "కాకి బావ నీ గొంతుని ఒక్కసారి వినాలనుంది ఒక్కసారి నాకోసం పాడవా" అంది. 
తానొక మహా గాయకుడిగా బావించుకుని పాడదామని నోరు తెరిచించి కాకి అంతే, నోట్లో ఉన్న రొట్టె ముక్క కాస్తా పడిపోయింది. రొట్టె కింద పడటంతో ఏమాత్రం ఆలస్యం చేయక నక్క రొట్టెను నోట కరచుకొని పారిపోయింది. 

కొంగ జపం


కొంగ జపం 

అనగనగా ఒక కొంగ. అది చాలా టక్కరిది. ఒకరోజు అది ఒక ఎండుతున్న చెరువును చూసింది. ఆ చెరువులో వాలి ఒక్క కాలితో జపం చేస్తున్నట్లు నటిoచింది. అది ఎంతసేపటికి అలాగే వుండటంతో మొదట దానిని నమ్మని చేపలు కూడా దాని దగ్గరికి వచ్చి చూడటం మొదలెట్టాయి. 
అలా ఒకపూట గడిచాక కొంగ ఉపన్యాసం ప్రారంబించింది " ప్రియమైన స్నేహితులారా నేను నిన్ననే హిమాలయాల నుండి వచ్చాను. నేను ఎవరికీ ఏ హాని తలపెట్టకూడదని  అని ఒట్టు పెట్టుకున్నాను. మీరంతా ఈ చెరువుని ఆధారం చేస్కుని అనేక సంవత్సరాలు ఇక్కడే గడుపుతున్నారు. నేను చెప్పొచ్చేదేంటంటే ఈ చెరువు ఇప్పుడు ఎండిపోబోతుంది కావున మీరంతా నా మాట విని వేరొక చెరువులోనికి వెళ్దామని కోరుతున్నాను అంది. 
అందుకు చేపలు "ఇంకో చెరువు లోనికా మేము నేల మీదికొస్తే చచ్చిపోతాం  కదా ఇంకో చెరువు వరకు ఎలా వెళ్ళగలం" అన్నాయి.  
ఇంకో చేప "ఐనా ఆ చెరువు మాత్రం ఎండదని నమ్మకం ఏంటి" అంది. 
అందుకు కొంగ "చూడండి స్నేహితులారా నేను ఆకాశంలో ఎగరగలను. నేను అలా ఎగురుతున్నప్పుడు ఒక పేద్ద చెరువు చూసాను. అది ఎంత పెద్దదంటే ఎప్పటికి ఎండదు. కాబట్టి మీరు నా సహాయం తీసుకొని కొత్త చెరువుని చేరవచ్చు" అని చెప్పింది. 
"అదే ఎలా"అన్నాయి చేపలు.  
"నేను రోజూ కొన్ని చేపల్ని ముక్కుతో కరచుకుని తీసుకెళ్ళి ఆ చెరువులో వదిలిపెడతాను సరేనా" అంది కొంగ 
కొంగ మాటలు నమ్మిన చేపలు రోజూ వంతులేసుకుని మరీ కొంగతో ప్రయానమయ్యాయి. చివరకి ఒక పీత మాత్రం మిగిలిపోయింది పీత పెద్దది కాబట్టి నోతకరచుకోలేకపోయింది కొంగ. అందుకు పీతని తన మీద ఎక్కి తన మెడ పట్టుకోమంది కొంగ.  వెళ్తుండగా దారంతా చేపల ముళ్ళులే... రొజూ కొంగ తీసుకు వచ్చిన తన స్నేహితులైన చేపల్ని చెరువులోనికి చేర్చకుండా చంపి తినేసిందని తెలుసుకుంది పీత. వెంటనే పీత తను పట్టుకున్న కొంగ మెడని తన పళ్లతో బలంగా కొరికింది అంతే కొంగ చచ్చిపోయింది.  

Tuesday 26 February 2013

రెండు పిల్లులు

రెండు పిల్లులు 

అనగనగా ఒక ఊర్లో రెండు పిల్లులు ఉండేవి. ఒకరోజు వాటికి ఒక రొట్టె దొరికింది. ఆ రొట్టె తనకు కావాలంటే తనకు కావాలి అని పోట్లాడుకున్నాయి. అలా పోట్లాడుకోడాన్ని ఒక కోతి గమనించి పిల్లుల పోట్లాట తీరుస్తానని వాటి మధ్యకి వచ్చింది. 

పిల్లులు కోతి మధ్యవర్తిత్వంకి వొప్పుకున్నాయి. మొదట కోతి రొట్టెని రెండు భాగాలుగా విరిచింది. ఒకటి పెద్దగా రెండోది చిన్నగా వుందని, వాటిని సమంగా చేయడానికి పెద్ద ముక్కలో కొంచం కొరికింది. ఇప్పుడు చిన్న ముక్క పెద్దది అయింది అని, చిన్న ముక్కలో  కొంచం తిన్నది. ఇప్పుడు మొదటి పెద్ద ముక్క పెద్దది అయింది అని దాంట్లోనుంచి ఇంకోoచం తిన్నది. ఇంకా చిన్ని చిన్ని ముక్కలు రెండు చేతుల్లో వుండటంతో రెండు ఒకేసారి నోట్లో పెట్టేస్కుని అక్కడనుంచి పరిగెత్తింది కోతి. అప్పటి వరకు పోట్లాడుకున్న పిల్లులు నిర్గాంతపోయి చూశాయి కోతి వంక... 

నక్క బావకి కొంగ విందు

నక్క బావకి కొంగ విందు:


అనగనగా ఒక నక్క, ఒక కొంగ రెండూ మంచి స్నేహితులు. అయితే ఒక రోజు నక్క వాళ్ళింట్లో పాయసం చేసానని కొంగని పిలిచింది. కొంగకి పాయసం అంటే చాలా ఇష్టం. అందుకని వెంటనే నక్క ఇంటికి వెళ్ళింది. నక్క కొంగకి ఒక ప్లేటులో పాయసం పొసి ఇచ్చింది. కొంగకేమో పొడుగు ముక్కు అసలు పాయసం దాని ముక్కు కొనలకే అంటుతుంది కానీ నోట్లోకి వెళ్ళట్లేదు. నక్క మాత్రం తాను కూడా ఒక ప్లేట్ లో పాయసo పోసుకుని మొత్తం తన నాలుకతో నాకి తినేసింది.

 నక్కకి బుద్ధి చెప్పాలని, కొంగ ఈసారి తనింట్లో పాయసం చేసానని నక్కని పిలిచింది. నక్క వెళ్ళినప్పుడు ఒక సన్న మూతి వున్న కూజలో పాయసం పోసింది కొంగ. 

కొంగకి సన్న మెడ కాబట్టి కూజా లోపలి తలపెట్టి తాగేసింది కాని, నక్క తినలేక పోయింది. తాను చేసిన పనికి సిగ్గు పడి క్షమాపణ వేడుకుంది .

Sunday 24 February 2013

నిదురించే రాకుమారి

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజుగారికి  ఒక రాకుమార్తె జన్మించింది. రాకుమార్తె జన్మించటంతో రాజ్యమంతా రాకుమార్తెని దీవించడానికి రాజభవనానికి ఆహ్వనించబడ్డారు కాని వారు ఒక మంత్రగత్తెని ఆహ్వానించటం మరిచిపోయారు కోపంతో ఆ మంత్రగాత్తె రాజభవనానికి వచ్చి పాపను పడుకోబెట్టిన వుయ్యలను చేరి ఈమె 16 ఏళ్లకు చనిపోతుందని శపించింది. రాణి నిర్గాంతపోయి మంత్రగాత్తెని శాపం తొలగించమని వేడుకుంది. ఈమెకు 16 ఏట మీ రాజ్యం, రాజభవనం అంతా దీర్గనిద్రలోకి జారుకుంటుంది అని చెప్పింది మంత్రగాత్తె. అయితే ఎప్పుడు మేమంతా నిద్రనుంచి మేలుకుంటామని రాణి ప్రశ్నించగా... మంత్రగాత్తె  రాకుమారిని స్వచ్చంగా ప్రేమించిన వ్యక్తి తనను తాకినప్పుడు అని సమాధానం చెప్పిoది. ఏళ్ళు గడిచాయి రాకుమారి ఆ రాజ్యమంతతికి అందగత్తెగా మారిoది. తన 16వ పుట్టిన రోజున నిద్రలోనికి జారుకుoది. తనతో పాటు తన పరివారం అంతా నిద్రలోనికి జారుకుoది.


చాలా ఏళ్ళు గడిచాయి...నిద్రపోతున్న వారు అలాగే వున్నరు. రాజభవనం పాతది అయింది. చుట్టూ పిచ్చి మొక్కలు బాగా పెరిగి, పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగ మారిపోయింది 
ఒక రోజు ఒక సాహసవంతుడైన యువకుడు ఆ రాజ్యంలో ప్రవెసించాదు. అందరు నిద్రపోతుండటంతో అందరిని తట్టి లేపటం మొదలెట్టాడు, బాకాలు ఊదాడు ఎవ్వరు లేవలేదు, ఎంతకి లేవకపోవటంతో విసిగి రాజభవనం లోపలికి  ప్రవేసించాదు. అక్కడ రాకుమార్తె గదిలో ప్రవెసించాదు. నిద్రపోతున్న రాకుమార్తె చాలా అందంగా వుండటంతో ఆ  యువకుడు ఆమె మీద మనసుపడ్డాడు మెల్లిగా ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. అంతే రాకుమారి కళ్ళు తెరిచింది. రాకుమార్తె పరివారం అంత నిద్రలేచారు. అందరు ఒకరిని ఒకరు ఆశ్చర్యపోయి చూసుకున్నారు, సంతోషంతో వచ్చిన యువకునితో రాకుమార్తె వివాహం జరిపించారు. 

Friday 22 February 2013

పిల్లి మేడలో గంట కట్టేదెవరు



అనగనగా ఒక ఊర్లో ఒక పాడుబడిన ఇల్లు. ఆ ఇంట్లో చాలా ఎలుకలు ఉండేవి. అక్కడ ఎలుకలు ఎక్కువగా వుండటం తో కొత్తగా ఒక పిల్లి కూడా చేరింది. అది రోజూ బోలెడన్ని ఎలుకలను చంపి తినేది. క్రమంగా ఎలుకల సంఖ్య తగ్గిపోయింది.ఎలుకలు పిల్లి భయానికి బయటకి రావటమే మానేశాయి ఇలా వుంటే తాము ఆకలితో మాడిపోయి ఐన చనిపోతామని భయపడి, ఒకరోజు ఎలుకలన్నీ సమావేసమయ్యాయి. ఆ సమావేసంలో  "పిల్లి మెడలో గంట కడితే... తాము చావకుండా తప్పించుకోవచ్చు" అని  అనుకున్నాయి. 
అందుకు తమలో నుండి ఒక తెలివైన ఎలుకను ఎన్నుకున్నాయి. 





ఒకరోజు పిల్లి బాగా నిద్రపోతుంది. అప్పుడు ఆ తెలివైన ఎలుక వచ్చి పిల్లి మేడలో గంట కట్టింది. 
అప్పట్నించి ఎలుకలన్నీ గంట శబ్దం వినబడగానే పారిపోయి దాక్కుంటున్నాయి. పిల్లికి ఆహారం దరకక ఆ ఇంటినుంచి వెళ్లి పొయిoది.
పిల్లి వెళ్లి పోయినందుకు ఎలుకలు సంతోషించాయి 

Thursday 21 February 2013

నిజమైన రాకుమార్తె


అనగనగా ఒక రాజ కుమారుడు. ఆ రాజకుమారుడు పెళ్లి చెస్కొవాలనుకున్నాదు. తను పెళ్లి చేసుకోడానికి ఒక నిజమైన రాజకుమారి కావలనుకున్నదు. అనేక రాజ్యాలు, చాలా చోట్లు తిరిగాడు. ఎంతోమంది రాజకుమారిలు వున్నా అతనికి ఎవరూ నిజమైన రాజకుమారి అనిపించలెదు. అతడు దిగులుగా ఇంటి ముఖంపట్టాడు. 


ఒకరోజు రాత్రి కుంబవృష్టిగా వర్షం వస్తుంది. ఆ వర్షంలో రాజభవనం తలుపులు దబా దబా ఎవరో బాదటం మొదలెట్టారు. రాజకుమారుడు తలుపు తెరిచి చూడ గానే ఒక అందమైన రాకుమారి మెరిసే దుస్తుల్లో తడిచి పోయి చాలా సుకుమారంగా కనిపిస్తుంది. చూడగానే తనే నిజమైన రాకుమారి అని మురిసిపోతుండటంతో వాళ్ళ అమ్మ చూసి " బాబు చూపులకు ఆమె రాకుమారి లాగ కనబడుతున్నా నేను నిజమైన రాకుమారో కాదో అని ఒక పరిక్ష పెడతాను అందులో గెలిస్తే ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా"నంది.  రాకుమారుడు సరేనని ఒప్పుకున్నాడు. వాళ్ళ అమ్మ, రాకుమారి ఆ రోజు విశ్రమించటానికి ఒక గదిలో మంచం మీద ఒక బటాని గింజ వేసి దాని మీద ఒక ఇరువైకి పైగా పరుపులను, వాటి మీద ఇరవైకి పైగా మెత్తటి దుప్పట్లను పరిపించింది. రాకుమారిని ఆ పరుపు మీద నిద్రించమంది. 
పొద్దున్నే రాకుమారి కళ్ళు ఎర్రగా వుండటం చూసి రాత్రి నిద్రపట్టలేదా అని అడిగిoది. "ఎక్కడ మహారాణి రాత్రి నా పక్క కింద  ఏదో గుచ్చుకుంటూ వుంది నాకు అస్సలు నిద్ర పట్టా లేదు" అంది రాకుమారి.
మహారాణి ఇంత సుకుమారం గా వుందంటే ఈమె కచ్చితంగా నిజమైన రాకుమారే అని తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేసింది. రాకుమారుడు చాలా సంతోషించాడు.

ఆవు-పులి


అనగనగా ఒక ఆవు వుoది. అది చాలా మంచిది. ఒకరోజు ఆవు మేత మేస్తూ అడవిలోనికి వెళ్ళగా అక్కడ పులి ఒకటి కనిపించిoధి. పులి మీదికి దూకబోతుండగా ఆవు " పులి గారు నాకొక చిన్న బిడ్డ వున్నది... దానికి ఇంకా ఆహరం తినటం కూడా రాదు మీరు అనుమతిస్తే నేను ఈ రోజు వెళ్లి... రేపు మీ వద్దకు వస్తాను అంది"
పులికి నమ్మకం కలగకపోయినా ఆకలిగా లేదు కాబట్టి ఒక అవకాశం ఇచ్చిచూద్దామని వదిలి పెట్టింది. 
వదలన్గానే ఆవు తన దూడ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లిoది.దూడతో ఈ విధం గా చెప్పింది. 
"నాయనా నేను రేపు పులి వల్ల చనిపొబొతున్నా... నీకు మంచి బుద్ధుల్ని నేర్పించాలని పులితో చెప్పి వచ్చాను. 
ఎప్పుడు ఎవరితూను అబద్ధం చెప్పకు 
యజమాని కొట్టినా ఎదురు తిరగకూడదు 
అన్న మాటకు కట్టుబడాలి
పరులను హింసించా కూడదు" అంటూ ముగించింది 

పోదున్నే పులి దగ్గరికి ప్రయాణం అవుతున్న ఆవుని చూసి దూడ వెళ్ళవద్దని చాలా వేడుకుంది కాని ఆవు వారించి పయనమైoది.
ఆవు పులిని చేరుకోగానే..... పులి వెనకకు అడుగులేయ్యటం మొధలెట్టింది... ఇంత సత్యవాక్పరిపాలన కలిగిన దానివి నిన్ను తింటే నాకు పాపం చుట్టుకుంటుంది. నీవు వెళ్లి నీ బిడ్డ తో హాయి గా గడుపు మని చెప్పి ఆవుని విడచిపెట్టింది. 
నీతి:
ఇచ్చిన మాట నిలబెట్టుకొవాలి. 

Wednesday 20 February 2013

కోతి-మొసలి


అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి చాలా స్నేహం గా ఉండేవి. మొసలి వుండే కొలను వొడ్డునే కోతి నివసించేది. ఒకరోజు మొసలి బార్యకు కోతిని చంపి తినాలనిపించింది. అంతే తలనొప్పి వచ్చినట్లు నాటకం ఆడింది. ఎన్నాళ్ళకు తగ్గకపోయేసరికి మొసలి చాలా భాధపడింది. అప్పుడు మొసలి భార్య కోతి గుండెని తింటే తనకు తలనొప్పి తగ్గుతుందని తన కుబుద్ధిని చెప్పింది.
తనకు తెలిసిన కోతి తన స్నేహితుడు ఒక్కడే... కాబట్టి  ఆ మరునాటి రోజు మొసలి కోతిని అవతలి గట్టు మీదున్న తన ఇంటికి ఆహ్వానించింది. కోతి ఒప్పుకోడానికి, రావటానికి అక్కడ చాలా అరటిపళ్ళు ఉంటాయని ఆశ చూపింది.
కోతి మొసలి వీపు మీద ఎక్కి ప్రయాణం అయింది సరిగ్గా సరస్సు మధ్యలోనికి రాగానే మొసలి మునిగిపోతుంది "ఎందుకు నువ్వు మునుగుతున్నావ్" అని మొసలిని అడిగింది కోతి. ఉండబట్టలేక మొసలి జరిగిన విషయాన్నంత చెప్పింది.

అప్పుడు కోతి "అయ్యో నా గుండెని మా ఇంటి దగ్గరే మరిచి పోయాను.... ముందే చెప్పి వుంటే తెచ్చేదాన్ని కదా" అంటూ బాధ నటించింది.
తెలివి తక్కువ మొసలి కోతిని మరలా తన ఇంటి దగ్గర దింపింది. ఒడ్డు చేరగానే కోతి ఒడ్డుకి ఉరికి " ఎవరి గుండె శరీరంలో వుంటుంది కానీ, ఎవరైనా ఇంట్లో దాచోస్తారా... హమ్మయ్య... బ్రతికిపోయాను అని" అని అంటూ అడవిలోనికి పారిపోయింది.
ఇంకెప్పుడు మొసలి దరిదాపులకు కూడా రాలేదు కోతి.
నీతి:
ఉపాయం తో ఎంతటి అపాయాన్ని అయిన తప్పించుకోవచ్చు.

Tuesday 19 February 2013

విజేత ఎవరు

ఒక తండ్రి కొడుకుకి  చెబుతున్న జీవిత సత్యమిది.వ్యాపారం లో నష్టం వచ్చింది ఎం చెయ్యాలి అని తన ముసలి తండ్రి ని ప్రశ్నించాడు కొడుకు ..
కొడుకు: నాన్న ఎలా గెలవాలి నాన్న... అస్తమానం ఓడిపోతున్నా...
తండ్రి: ఏది ఏమైనా గెలిచేదాక  వేచిచూడాలి.... గెలవాలనే తపన వుండాలి మనలో... 
కొడుకు: నాకు తపన వుంది నాన్న కాని ఎందుకో తేలీదు... నష్టం పెరుగుతుందని భయంగా వుంది
తండ్రి: ఆకరి వరకు ప్రయత్నించాలి రా... కొంతమంది తమకు విజయం సొంతం అయ్యే ముందు పనిని వదిలేస్తారు, ముందటి వరకు చాలా కస్టపడి పనిచేసి ఎలా వదల బుధవుతుందో
ఇప్పటి దాక ప్రయత్నించావు కదరా... ఇంకొంచం ఓపిక పట్టు.. నువ్వు తయారు చేసిన వస్థువులు ఇంకా ఎవరికీ చూపించలేదు, అమ్మనులేదు ఇప్పటి వరకు పెట్టుబడి పెడుతూనే వచ్చావు కదా
కొడుకు: నిజమే నాన్న
తండ్రి: నాకు ద్రుష్టిలో విజేత అంటే దేవుడిచ్చిన ప్రతిభ ను గుర్తిoచి,కస్టపడి దానిని ఒక నైపుణ్యం గా మార్చుకుని, గమ్యాన్ని చేరగలిగిన వాడే..
భయపడకు ఒక నెల రోజుల్లో మన వస్తువులు మార్కెట్ లోనికి విడుదల కానివ్వు. అంతగా నిలదొక్కుకోలేకపోతే అప్పుడు చూద్ధాము. ఐనా  ఆకరికి వదిలేస్తానంతావేంటి. నామాట  విను రా 
తండ్రి మాటవిన్న కొడుకు తండ్రి మాటకు విలువనిచ్చి వేచిచుసాడు 
మార్కెట్ లో ఉన్నతమైన వుత్పత్తిలను ప్రవేసపెత్తగాలిగాడు 
వ్యాపారం లో విజయాన్ని సాధించాడు.

నీతి: పనిని మొదలు పెట్టక వదల వద్దు. ఇక్కడ తండ్రి సూచన మేరకు కొడుకు నడవ లేకపోయి వుంటే తాను పడిన శ్రమ అంత బూడిద లో పోసిన పన్నెరు అయ్యేది. 

Thursday 14 February 2013

తాబేలు కుందేలు పరుగుపందెం

ఒకానొక  అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. తాబేలు చాలా మెల్లిగా నడుస్తుందని కుందేలుకు అలుసు.  ఎలాగైనా తనే గెలుస్తాను అని తాబేలుతో పరుగుపందానికి వెళ్ళాలి అనుకుంది కుందేలు. అనుకున్నదే తడవుగా తాబేలుని ఒప్పించింది. అలా ఒకరోజు కుందేలు తాబేలు పరుగుపందెం వేసుకున్నాయి. కుందేలు పరుగు మొదలవగానే చాలా దూరం పరిగెత్తింది. దానికి తాబేలు చాలా దూరంలో కనబడింది. "ఆ.. అదెప్పుడు  వచ్చేనులే ఈ లోపల నేనొక కునుకు తీయోచ్చు" అనుకుంది. పక్కనే ఉన్న చెట్టు కిందకు చేరి హాయిగా నిద్రపోయింది. తాబేలు మెల్లిగా నడుచుకుంటూ కుందేలుని దాటుకుని ముందుకెళ్లిoది . కుందేలు లేచి చూసే సరికి తాబేలు పందాన్ని గెలిచేసింది.



నీతి:
సోమరితనం కూడదు... చేయాల్సిన పనిని వాయిదాలు వేయకూడదు.

ముని-ఎలుక

యమునా నది తీరంలో ఒక ముని నివసించేవారు. ఆయన అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని వుంటున్నారు. ఆ ముని ఆశ్రమ సమీపంలో ఒక ఎలుక నివసించేది. ఒకరోజు ఆయన తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుండగా ఆ ఎలుక పిల్లి తరుముతుంటే బయపడి ముని వొళ్ళోకి వచ్చి చేరింది. ముని దానిని చూసి జాలినొంది తన తపస్సు శక్తితో ఆ ఎలుక మీద తన కమండలంతో నీళ్ళు పోశారు. అది వెంటనే పిల్లిగా మారిపోయింది. పిల్లిగా మారిన ఎలుక అక్కడి నుంచి కృతజ్ఞతతో వెళ్లిపోయింది.
కొన్నాళ్ళకు ఆ పిల్లి మళ్లీ కుక్క తరుముతుంటే ముని దగ్గరికి వచ్చి వేడుకుంది. ముని దానిని కుక్కగా మార్చారు. కుక్క గా మరిన పిల్లి ముని కి కృతజ్ఞత చెప్పి బయటకి వెళ్లి పోయింది.
కొన్నాళ్ళకు అది పులిని చూసి భయపడి మళ్లీ ముని దగ్గరకి వచ్చింది పులి అంటే తనకు భయమని చెప్పింది. ముని దానిని పులి గా మార్చారు. కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది.
పులిగా మారిన ఎలుకకు భయపడి జంతువులన్నీ దాక్కుoటున్నాయి అప్పుడు అది చాలా సంతోషించింది. కాని దానికి ఆహరం దొరకకపోయింది. ఆకలి వేసే సరికి పులికి ముని గుర్తుకి వచ్చాడు. ఆయనని తినేస్తే తను ఎప్పటికి పులిగానే వుoడిపోవచ్చు అని ఆలోచించి ముని దగ్గరికి వెళ్లి ఆయనని తినడానికి ముని మీదకు దూకబోయింది ముని దాని మీద కమండలపు నీళ్ళు పోసి మళ్ళీ ఎలుకను చేసారు. ఎలుకగా మారిన పులి తాను చేసిన పనికి  సిగ్గుతో తన కలుగులోనికి తిరిగి వెళ్లిపోయింది.

స్వర్గం-నరకం

ఒకానొక మహారాజుకు స్వర్గం నరకం గురించిన సందేహం వచ్చింది. తన మంత్రిని వాటి తేడా వివరించమన్నాడు.లేకపోతే మరణదండన విదిస్తానని చెప్పారు రాజు గారు.మంత్రి తనకు కొంచెం గడువు ఇవ్వమన్నాడు.
తర్వాతి రోజు మహారాజా  నేను నిన్న రాత్రి కలలో నేను స్వర్గాన్ని నరకాన్ని చూసివచ్చాను.
నరకంలో కొంత మంది ఏడుస్తూ వున్నారు... వారి ముందు రకరకాల రుచికరమైన ఆహారం వుంది. కానీ వారి మోచేతులు చేతులకు చెక్కలు కట్టారు. ఏమి తినలేక చిక్కి శల్యమై ఆకలితో అలమటిస్తున్నారు.తరువాత నేను స్వర్గం లో ప్రవేశించాను. అక్కడ ప్రజలంతా చాల సంతోషం తో వున్నారు. వారి ఎదుట కూడా రకరకాల రుచికరమైన ఆహారం వుంది.

రాజు గారు ఉత్సాహంతో "వారి చేతికి చెక్కలు లేవు కదా" అన్నారు
"వున్నాయి మహా రాజ" అన్నారు మంత్రి గారు
"మరి ఎలా వారు సంతోషం తో వున్నారు?" అడిగారు రాజు గారు.
వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ... ఒకరికి ఒకరు తినిపించుకున్తున్నారు అని చెప్పారు మంత్రి గారు.
మంత్రి తెలివికి సంతోషించి రాజు గారు బహుమానాల్ని ఇచ్చారు.

నీతి:

ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వుంటే ఎప్పటికి ఇబ్భందులు, కష్టాలు, గొడవలు రావు. 

చీమ విశ్వాసం

అనగనగా ఒక చీమ అది పొరపాటున జారి నీళ్ళలో పడిపోయింది. కొట్టుకుంటూ కొట్టుకుంటూ నీటి ప్రవాహానికి మునకలు వేస్తూ వేగంగా కదులుతుంది. చీమ పరిస్థితిని చూసి జాలి పడి చెట్టు మీద నుంచి ఒక పావురం ఒక ఆకు తుంచి నీటిలో వేసింది. బ్రతుకు జీవుడా అని చీమ ఆ ఆకు మీదకు ఎక్కి ప్రాణం రక్షించుకుంది.
ఇంకో రోజు చీమ తన ఆహరం తన నోటితో పట్టుకుని సన్నటి బాట మీద నడుస్తుంది. చీమ తలెత్తి చూడగానే చీమకు తనను కాపాడిన పావురం కేసి గురిచూసి బాణం వేయబోతున్న వేటగాడు కనిపించాడు.


                                                                                       

 వెంటనే ఆ ఆహారాన్ని కింద పడేసి వెళ్లి ఆ వేటకని కాలిని కుట్టి కిందకు  పడింది. ఎందుకంటే అదే చోటు వుంటే వేటకాడు తనని నలిపి చంపవచ్చు. నొప్పికి "అమ్మ" అన్న వేటగాని అరుపుతో పావురం తప్పించుకుని తన ప్రాణాన్ని కాపాడుకుంది.
నీతి:
మనకు సహాయం చేసిన వారికి తిరిగి మనం సహాయం చెయ్యాలి.

Wednesday 13 February 2013

శిబి చక్రవర్తి

ఆడినమాట నిలబెట్టుకోవడం, ధర్మపధంలో నడవటంలో శిబి చక్రవర్తి మన పురాణాలలో చాలా పేరు పొందిన వ్యక్తి.
ఒకనాడు ఇంద్రుడు డేగ వేషంలో, అగ్ని పావురం వేషం లోకి మారి శిబి చక్రవర్తిని పరిక్షించదలిచారు.

డేగ పావురాన్ని తరుముతూ వచ్చింది, పావురం శిబి చక్రవర్తిని చేరి శరణు అని వేడుకుంది.శిబి చక్రవర్తి పావురానికి అభయమిచ్చాడు.అంతలో డేగ శిబిని చేరి తనకు ఆహరం కావాల్సిన పావురాన్ని తనకు ఇచ్చేయమని అడిగింది.అందుకు శిబి "నేను దానికి అభయమిచ్చాను కావాలంటే నేను దానికి బదులుగా నా దగ్గర వున్న వేరే ఏ ప్రాణిని అడిగినా ఇస్తానని చెప్పాడు. అప్పుడు డేగ "అయితే నీ శరీరం నుంచి పావురం బరువు తూగేంత  మాంసం  ఇవ్వమని కోరింది.
శిబి ఒక కాoటా తెప్పించి అందులో ఒక వైపు పావురాన్ని పెట్టి ఇంకో వైపు తన తోడ చీల్చి మాంసాన్ని వేస్తువచ్చాడు.
పావురం బరువంత మాంసం తీయగానే...ఇంద్రుడు, అగ్ని తమ నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు. శిబి తోడ మామూలుగా మారింది. శిబి ధర్మoగా నడుచుకున్నాడని దేవతలు పువ్వుల వర్షం కురిపించారు. శిబి తన రాజ్యాన్ని చాలా కాలం పాలించాడు.

నీతి:
శిబి తన ప్రాణం మీదికి వస్తే, తను ఇచ్చిన మాటను వదులుకోవాచు కదా!.. కాని శిబి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. చిన్న ప్రాణి ఐన పావురం ప్రాణం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంటే ప్రాణం పోయిన ఆడిన మాట తప్పకుడదు అన్నమాట. 

ఏడుగురు రాజకుమారులు

నాకు మా అమ్మ ఎక్కువగా చెప్పిన కధ...
అనగనగనగా ఒక రాజుకి  ఏడుగురు కొడుకులున్నారంట...

ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారoట...
అందులో ఒక చేప ఎండలేదు..
అందుకని వాళ్ళు చేపని అడిగారు "చేప చేప ఎందుకు ఎండలేదు?"
చేప అంది "గడ్డి పరక అడ్డువచ్చింది"
"గడ్డి పరక గడ్డి పరక ఎందుకు అడ్డు వచ్చావ్?"
" ఆవు నన్ను మెయ్యలేదు"
"ఆవు ఆవు ఎందుకు మెయ్యలేదు?"
" బుడ్డోడు నన్ను మెయ్యటానికి వదల్లేదు"
" బుడ్డోడ బుడ్డోడ ఎందుకు ఆవుని వదల్లేదు?"
"పాప ఏడ్చింది"
"పాప పాప ఎందుకు ఎడిచావు?"
" చీమ కుట్టింది "
"చీమ చీమ ఎందుకు కుట్టావు?"
" నా బంగారు పుట్టలో వేలు పెడితే నే కుట్టనా..."అంది.

కాకి ఉపాయం

 అనగనగా ఒక కాకి, ఒక చెట్టు మీద గూడు కట్టుకుంది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట వుంది. కాకి ఎప్పుడు గుడ్లు పెట్టినా పాము తినేసేది. కాకి కి చాలా కోపం వచ్చేది. సమయం కోసం వేచి చూడసాగింది.



ఒకరోజు తన గూడున్న చెట్టు పక్కనున్న చెరువు లోనికి ఆ రాజ్యపు రాణి గారు తన చెలికత్తెలతో స్నానం చెయ్యటానికి వచ్చారు. రాణి గారు తన నగలన్నీ వలిచి గట్టు మీద పెట్టి స్నానం చెయ్యటానికి చెరువు లోనికి దిగింది. అదే అదను గా కాకి తన ముక్కుతో రాణి గారి హారాన్ని కరచుకుని తీసుకెళ్ళి పాము పుట్టలో పడేసింది. రాజభటులు కాకి ని వెంబడించి పాము పుట్టలో నగను పడేసిన సంగతి తెలుసుకున్నారు. పాము పుట్ట తవ్వి నగ తీయాలని ప్రయత్నించారు. అప్పుడు పాము అందులోనే వుండటంతో అది బుసకోట్టింది. పాము కరుస్తుందనే భయం తో రాజ బటులు పాముని చంపేసి నగ తీస్కున్నారు. పాము పీడ విరగడైందని కాకి సంతోషించింది.


Tuesday 12 February 2013

అమ్మ పాటం

ఒకానొక వూరిలో ఒక అమ్మ, ఒక కూతురు వుండేవారు. అమ్మకు చదువు రాదని ఇంట్లోనే వంట చేస్తూ తీరిగ్గా ఉంటుందని ఆ కూతురు భావించేది. ఒకరోజు పరీక్ష లో తక్కువ మార్కులు వచ్చాయని చదవకుండా కూర్చున్న కూతురుకి ఒక పాటం చెప్పాలని అనుకుంది వాళ్ళ అమ్మ. కూతురుని కారోట్, కోడిగుడ్డు, టీ పొడి తీసుకొని రమ్మంది అమ్మ. మూడింటిని మూడు వేరు వేరు పాత్రలలో పోసి, నీళ్ళ లో 20 నిమిషాల పాటు వుడికించమంది. 20 నిమిషాల తర్వాత తన దగ్గరికి ఆ మూడు పాత్రలు తేవలిసిందిగా చెప్పింది. కూతురు అలాగే చేసింది.
మొదట కారోట్ ఉన్న పాత్రని చూసారు అది చాలా మెత్త బడింది.
తరువాత గుడ్డు... గుడ్డులోని సోన అంతా బాగా ఉడికి గట్టిబడింది
తరువాత టీ పొడి... అది వేసిన నీళ్ళు రంగు మారి మంచి వాసన, మంచి రుచిని సంతరించుకున్నాయి.
"ఊ... ఇప్పుడు చెప్తాను" విను అంది అమ్మ, కుతుతూ శ్రద్ధ గా వింటుంది

"మనకి కష్టాలు ఈ వేదినీళ్ళలాగే వస్తాయి... ఒక్కొక్క మనిషి కష్టాలకు ఒక్కోలాగా స్పందిస్తాడు. కారోట్ చూడు కష్టం అనే వేడి నీళ్ళు దానిమీదికి రాంగానే అది మెత్తబడింది. అంటే కష్టం రాంగానే అది కుంగిపోయింది. అదే గుడ్డుని చూడు దాని లోపలి సోనని బయటికి రాకుండా కాపాడటానికి దాని పెంకు గట్టిగా మార్చుకుంది. నీటి వేడి పెరిగే కొలది తనని గట్టిగా మార్చుకుంది. అంటే కష్టాలు వచినప్పుడు తన వాళ్ళను పదిలపరచుకోవటమే కాక తనను కూడా దృడంగా చేసుకుంది. ఇక టీ పొడి తనను హింసించడానికి వచ్చిన వేడి నీటిని మార్చింది తన లక్షణాలను తన పరిమళాన్ని దానికి ఇచ్చింది అంటే, కష్టాన్ని తనకు అనువుగా మార్చుకుంది. ఇప్పుడు చెప్పు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు చెప్పు" అంది అమ్మ
"నిజంగా నువ్వు రోజూ  చేసే చిన్న పనిగా భావించే వంట నుంచి ఇన్ని విషయాల్ని నేర్చుకోవచ్చా అమ్మ" అంటూ తల్లి ని హత్తుకుంది కూతురు.


ముగ్గురు స్నేహితులు

ఒకానొక ఊరిలో ముగ్గురు స్నేహితులు వుండేవారు. వాళ్ళ పేర్లు రాము, సోము, శ్యాము. ఒకరోజు వారికి ఒక పుస్తకం దొరికింది. "మన వూరిపక్కన వుండే కొండ దాటితే మొదట రాగిపురం వుంటుంది అందులో మొత్తం రాగి నాణాలు వుంటాయి, దాని తరువాత వెండినగరం అందులో మొత్తం వెండి నాణాలు వుంటాయి, ఆ తర్వాత బంగారుపురం అందులో మొత్తం బంగారు నాణాలు వుంటాయి, అయితే ఆయా ఊర్లను చేరగలిగిన వారు అందులోని నాణాలను ఎన్నైనా తీసుకోనవచ్చును" అని రాసి వుంది.

ముగ్గురు కొంత ఆహరం నీరు మూటలు కట్టుకుని బయలుదేరారు. కొండ ఎక్కి దిగడానికి చాలా కష్టపడ్డారు కాళ్ళు నొప్పెట్టాయి. రాగిపురం చేరారు. రాము నాకు ఈ రాగి నాణాలు చాలు నేను వీటిని తీసుకుని ఇంటికి వెళతాను అన్నాడు. మిగతా ఇద్దరు నవ్వి నువ్వు కొంచం ఓపిక పడితే వెండినగరం చేరుతాము అన్నారు. రాము వారి మాటలు వినక ఇంటికి వెళ్ళిపోయాడు. రాగి నాణాలు అమ్మి, డబ్బులతో ఆనందం గా ఇల్లు చేరాడు.
మిగతా ఇద్దరు ప్రయాణం కొనసాగించారు. యడారి లాంటి బాటలో ప్రయాణించటం వాల్ల వారి దగ్గరున్న నీళ్ళు అయిపోయాయి. వెండిపురం చేరుకున్నారు. తేచుకున్న ఆహరం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. శ్యాము  నాకు ఈ వెండి  నాణాలు చాలు నేను వీటిని తీసుకుని ఇంటికి వెళతాను అన్నాడు. సోము నవ్వి నువ్వు కొంచం ఓపిక పడితే బంగారు నగరం చేరుతాము అన్నాడు . శ్యాము వాడి మాటలు వినక ఇంటికి వెళ్ళిపోయాడు. వెండి నాణాలు అమ్మి, డబ్బులతో ఆనందం గా ఇల్లు చేరాడు.
సోము ఒక్కడే ప్రయాణం కొనసాగించాడు నడిచి నడిచి అతని కాళ్ళు సహకరించటం లేదు, ఆహరం లేదు, నీళ్ళు లేవు అయిన బంగారం మీద ఆశ కొలది ప్రయాణం సాగించాడు. మార్గ మాధ్యమం లోనే చనిపోయాడు.
నీతి:
ఆశ కి మితం వుంటుంది, మనకు మించిన ఆశ చివరకు ప్రాణాల్ని కూడా బలిగొంటుంది. చివరవరకు ప్రయత్నించటం మంచిదే కాని సాధ్యాసాధ్యాల్ని కుడా ఆలోచించాలి. సోముకి తెలుసు తను వెళ్ళటం అసాధ్యమని కాని మొండి గా ఆలోచన లేకుండా ప్రయత్నించి బంగపద్దదు.

తెలివైన ఏనుగు

అనగనగా ఒక ఏనుగు. ఆ ఏనుగు ఎవరు దానికి అరటి పండు ఇచ్చినా వారిని రొజూ తన తొండంతో దీవిన్చేది. అది రోజూ చెరువుకి వెళ్లి స్నానం చేసి వచ్చేది. ఆ చెరువుకు వెళ్ళే దారిలో ఒక చెడ్డ దర్జీ (టైలర్) ఉండేవాడు. ఒకరోజు ఆ దర్జీ ఏనుగుకి అరటి పండు పెట్టాడు. అది సంతోషించి దీవించింది. రోజు తన కొట్టు ముందునుంచి వెలుతూ ఆ దర్జీని తన తొండం ఎత్తి దీవిన్చేది.

ఒక రోజు ఆ దర్జీ ఏనుగుని హింసించటానికి తను కుట్టుకునే సూదిని తెచ్చి, ఏనుగు దీవించటానికి  తొండం ఎతినప్పుడు ఏనుగు తొండం లో పొడిచాడు. ఏనుగుకి కోపం వచ్చింది కాని అప్పుడు ఏమి చెయ్యలేదు. ఐనా ఏనుగు రోజు దర్జీని దీవిన్చేది.కొన్నాళ్ళకు దర్జీ సూది గుచ్చిన విషయం మర్చిపోయాడు. ఆ రోజు దీపావళి ముందు రోజు దర్జీ కొట్టు నిండా కొత్త బట్టలు వున్నాయి. స్నానానికి వెళ్లి వచ్చిన ఏనుగు తన తొండం నిండా బురద నీళ్ళు నింపుకుని వచ్చి కొట్టులో వున్నా బట్టల నిండా కొట్టింది. మరకలు పడిన బట్టలని చూసి బట్టలు ఇచ్చిన ఊరి వాళ్ళంతా దర్జీని వొళ్ళు కుల్లబోడిచారు.
నీతి:
ఎంత బలమున్నా, జ్ఞానం వున్నా సరే కొన్నిసార్లు మనం ఓడిపొవలసి వస్తుంది. సమయం కలిసి రానిదే ఏమి చెయ్యలేము, మనకు ఒక అవకాశం వస్తుంది.ఏనుగు ని చుడండి దర్జీ సూదితో పొడవగానే అది అతన్ని ఏమైనా చేస్తే చెడ్డ ఏనుగు అని అంత చెప్పుకునే వారు. అది వేచి వుంది తన పని తను సాధించింది. అమ్మనాన్నలు తిట్టినప్పుడు మాత్రమే చదవటం కాదు చదివి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుని వాళ్ళని సంతోష పెట్టాలి సరేనా... 

సింహం-నాలుగు ఎద్దులు

ఒకానొక అడవిలో నాలుగు ఎద్దులు ఉండేవి. అవి చాలా బలంగా ఉండేవి. అవి ఒకదానితో ఒకటి చాలా స్నేహంగా కలివిడిగా ఉండేవి. అడవికి రాజైన సింహం కన్ను వాటి మీద పడింది. వాటిని చంపి తినాలని వాటి మీదికి దూకింది.కాని అవి ఒక్కటిగా సింహం పైకి దూకేసరికి వాటిముందు సింహం నిలువలేక పోయింది. ఎద్దుల కొమ్ములు  సింహపు శరీరంలో దిగి చాలా బాధపడింది.సింహం గాయాలను చూసిన నక్క వాటిని విడదీసి చంపటం తీలిక అని సలహ  చెప్పింది.

ఒక రోజు నక్క ఒక్కో ఎద్దు దగ్గరికి వెళ్లి " నిన్ను గురించి మిగతా ఎద్దులు నువ్వు బుద్ధి లేనిదనివి అని, తెలివి తక్కువ దానివని అంటున్నాయని" చెప్పింది. నక్క దొంగ మాటలు ఎద్దులన్ని పూర్తిగా నమ్మి ఒకదానితో ఒకటి పోట్లాడుకున్నాయి. పోట్లాడుకుని విడిపోయాయి కూడా.
ఒంటరిన ఒక్కో ఎద్దుని చంపటం సింహానికి తేలిక పనైంది. రోజూ ఒక్కో ఎద్దుని చంపి తినటం మొదలెట్టింది. అది కడుపార తిని నక్క కి కూడా పెట్టింది.
నీతి:
కలిసిమెలసి వుంటే ఎంతటి కష్టాన్ని అయిన తేలిగ్గా ఎదుర్కొన వచ్చు.
విడిపోవటం వాల్ల ఈ కదా లోని ఎద్దుల్లాగా చాలా నష్టపోవాల్సి వస్తుంది.

Monday 11 February 2013

అందరూ అవసరమే

ఒక స్కూల్ లో ఒక టీచర్ ఆరి పరీక్ష పెట్టారు...

విద్యార్ధులు అంతా ఆసక్తితో ప్రశ్నాపత్రం చూస్తున్నారు. అందులో మొత్తం పది ప్రశ్నలు ఉన్నాయి. ఆరి ప్రశ్న ఇలా వుంది..

"మీ క్లాస్ రూం రోజూ శుబ్రం చేసే పని మనిషి పేరేమి?" అని 
ఒక విద్యార్థి లేచి సార్ ఈ ఆరి ప్రశ్నకి మార్కులు ఉన్నాయా అన్నాడు 
దానికి మాష్టారు "వున్నాయి" అని సమాధానం చెప్పారు 
సమాధానాలు రాసాక అన్ని జవాబు పత్రాల్ని తీసుకొని ఆరి ప్రశ్నకి ఎవరూ సమాధానం రాయకపోవటం గమనించి ఇలా చెప్పటం ప్రారంబించారు.
" మీకు సంవత్సరం నుంచి మీకోసం పని చేసే మనిషి పేరు తెలీదా ?" అన్నారు.
అందుకు విద్యార్ధులు " ఆమె నల్లగా, పొడవుగా వుంటుంది, ముసలమ్మ అని తెలుసును కానీ ఆమె పేరు తెలియదు "అని సమాధానం ఇచ్చారు.
"చూడండి... మీరు మీ జీవితం లో చాలా మందిని కలుసుకోవాలి, అందులో కొంత మంది గొప్ప వాళ్ళు కొంత మంది చిన్న వాళ్ళు అయివుంటారు. గొప్పవాళ్ళని అందరు అబినందిస్తారు. మీరు నా విద్యార్ధులుగా చెయ్యల్సింది ఏంటి అంటే... అందర్నీ గౌరవించండి, మనస్పూర్తిగా కృతజ్ఞత చెప్పండి, సాటి మనిషి గా అందరిని గుర్తించండి" అని చెప్పారు ఆ మాస్టారు.
ఈ బ్రతుకు పాటం ఒక్క విద్యార్ధిని మార్చినా మంచి పౌరుడు గా మారుతాడు గదా !!....

Thursday 7 February 2013

రెండు కప్పలు

ఒకసారి ఒక రెండు కప్పలు పొరపాటున రాత్రివేళ మజ్జిగ కుండలో పడ్డాయి...
అందులో ఒక కప్పు సన్నగా వుంది, ఇంకోటి బాగా బలంగా లావుగా  వుంది...
కప్పలు ఆ మజ్జిగ కుండ నుంచి బయటికి రావటానికి చాలా ప్రయత్నించాయి కాని రాలేకపోయాయి..
అలా ఒక గంట గడిచింది.
లావు కప్ప "బాబోయ్.. నేనింక ఈదలెను, నాకు చాల నీరసం వస్తుంది అన్నది"
సన్న కప్ప " ఈదు... మన ప్రయత్నం మనం చెయ్యాలి గా అంది"
ఇంకో గంట గడిచింది. మజ్జిగ లో వెన్న శాతం ఎక్కువ గా వుండటం మూలం గా అంచులకు ఎగ బాగుతున్నా జారిపోతున్నాయి.
లావు కప్పు " నా వాళ్ళ కావడం లేదు... ఇంతకంటే మునిగి ప్రాణాలు తీస్కోడం మంచిది" అన్నది.
సన్న కప్పు " ప్రయత్నించు... వదలకు అంటూ తన కాళ్ళలో లేని బలాన్ని తెచ్చుకుని ఈదుతూనే వుంది"
అరగంట అయింది.
లావు కప్ప ఈదడం ఆపేసింది... మునిగిపోయింది.
కానీ సన్న కప్ప ఈదుతూనే వుంది.
ఇంకో అరగంట అయింది సన్న కప్ప కళ్ళకు గట్టిగా  ఏదో తగిలింది. అంత సేపు కాళ్ళ తో ఈదటం వల్ల  వెన్న తయారై అది బయటకి వురకటానికి అది సహాయపడింది.


నీతి 
లావు కప్ప ఒక్క అరగంట ఓపిక పడితే బ్రతికేదే కాని  దానికి ఓర్పు లేక చచ్చిపోయింది. సమస్య ఎంత పెద్దది అని కాదు ఎంత కష్టమైన పనైనా ఓర్పు తో పరిష్కరించవచ్చు. చిన్న పాటి నిరాశ కొన్ని సార్లు ప్రాణాల్ని తీయొచ్చు. సన్న కప్పకు ఓపీక లేకపొయినా ఆకరి వరకు ప్రయత్నిస్తూనే వుంది తన ప్రాణాల్ని కాపాడుకోగలిగింది.

Wednesday 6 February 2013

సింహం - చిట్టెలుక

అనగనగా ఒక అడవి అడవిలో ఒక సింహం వుండేది... ఒక రోజు సింహం ఒక చెట్టు కింద నిద్రపోతుంది.ఆ చెట్టు బొరియలో వుండే చిట్టెలుక ఆటలాడుతూ సింహం తోక మీద నిలుచుంది. సింహానికి నిద్ర మెలకువ వచ్చి చిట్టెలుక ను పట్టుకుంది. 
అప్పుడు ఎలుక " నన్ను వదిలేయ్... ఎప్పుడైనా నీకు సహాయం చేస్తా" అని అంది.

అందుకు సింహం బిగ్గరగా నవ్వింది " నిన్ను తింటే నా పంటి కిందకు కూడా రావు... నువ్వు నాకు సహాయo చేస్తావా సరే పో..." అంటూ వదిలి పెట్టింది.
చాలా రోజులు గడిచాయి. ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చి వల పన్నాడు. సింహం వల లో చిక్కుకుంది. దీనం గ వల లోనుంచి చూస్తూ వుండసాగింది.
అటుగా వెళ్తున్న చిట్టెలుక సింహాన్ని చూసి అది చేసిన సహాయాన్ని గుర్తు తెచ్చుకుని.. వల దగ్గరికెళ్ళి పటపట కొరికి సింహాన్ని బయటకు తెచ్చింది.
సింహం ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పి తన గుహ లోనికి వెళ్లి పోయింది.
నీతి:
చిన్న వాళ్లకు ప్రమాదం లో సహాయం చేయటానికి అలోచిoచకూడదు. 
ఇతరులు చేసిన సహాయాన్ని ఎప్పటికి గుర్తుంచుకోవాలి.


బంగారు కొండ

ఒకానొక ఊర్లో ఒక చిన్న పాప వుండేది.  వాళ్ళ వూరు ఒక కొండ ప్రాంతం.చిన్న నాటినుంచి ఆ పాప వాళ్ళింటికి దూరంగా వుండే కొండని చూస్తూ వుండేది. కారణం అది బంగారు వర్ణం తో మెరుస్తూ వుండేది. ఎలాగైనా ఆ కొండని ఎక్కాలని అనుకునేది ఆ చిన్ని హృదయం.
ఒక రోజు ఇంట్లో చెప్పకుండా ఒక్కతే కొండ వైపుకు ప్రయాణమైoది. చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఎంత వెళ్ళిన ఆ కొండమీద బంగారమే కనబడలేదు. కొండమీద నుంచి చూస్తే ఒక గుడిసె బంగారం లా మెరుస్తువుంది. అది తన ఇల్లే. సూర్యుని కిరణాల వల్ల అది మెరుస్తుందని తెలుసుకుంది. తను తెలుసుకున్న విషయాన్నీ తన తల్లికి చెప్పాలని ఆరాటంతో ఇంటికి పయనమైంది.
నీతి:
"దూరపు కొండలు ఎప్పుడూ  నునుపే" .. మన ఇంటికంటే అందమైన ప్రదేశం ఈ ప్రపంచంలోనే ఉండదు. ఈ రోజుల్లో చదువులని, ఉద్యోగాలకని , పెళ్ళిళ్ళు అయ్యి వేరే కాపురాలతోనో ఇంటి నుంచి బయటికోస్తున్నాం వచ్చాక గాని తెలియట్లేదు మన ఇల్లు ఎంత బాగుండేదని.

చీమ ఇచ్చిన గెలుపు

ఒక  చిన్న రాజు తన కంటే పెద్ద రాజు చేతిలో ఓడిపోయి గుహ లో దాక్కున్నాడు...అలసిపోయిన ఆ రాజు కి నిద్రపట్టింది. లేచి చూసేసరికి...
ఆ గుహ లో ఒక చీమ తన కంటే పెద్దదైన ఆహారపు గింజ తో పైకి ఎక్కుతుంది. ఎక్కిన ప్రతి సారి అది జారి కిందపడుతుంది..
రాజు కి మరింత ఆశక్తి కలిగింది ఆ చీమ ని చూస్తుంటే. అది ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే వుంది. అలా ఒక పూట గడిచింది... ఇంకా ప్రయత్నిస్తూనే వుంది. చివరకు ఆ గోడ పైకి ఎక్కగలిగింది. 
ఇదంతా చూస్తున్న రాజు చీమ ఒక సారి ఓడిపోయిన మళ్లి ీ మళ్లి ీప్రయత్నించి గెలిచింది. నేను కూడా గెలవలేన అని పౌరుషం తో ముందుకు ఉరికాడు. చిన్న రాజు నుంచి పోరాటాన్ని ఉహించని పెద్ద రాజు ఓడిపోయాడు. 
రాజు చీమ నేర్పిన గుణపాటాన్ని జీవితం లో మర్చిపోలేదు 

నీతి: 
మంచి నేర్చునే విషయం లో ఎప్పుడు చిన్న పెద్ద ఆలోచించకూడదు.
                                                             
                                                   

చిన్న పిట్ట

 అనగానగా ఒక అడవిలో చాలా జంతువులు, పక్షులు ఉండేవి. ఒకానొక రోజు అడవిలో చెట్ల కొమ్మలు రాసుకొని అగ్ని పుట్టింది. అది గమనించిన జంతువులు పక్షులు అన్ని దగ్గరలో వున్న చెరువు లోనికి దిగాయి. ఒక చిన్న పిట్ట మాత్రం తన చిట్టి రెక్కలతో ఎగురుతూ తన నోటితో వీలైనన్ని నీళ్ళని తీసుకొని మంటల మీద పోయసాగింది. అది చుసిన జంతువులు అన్ని నవ్వాయి. కొన్ని జంతువులు దాన్ని ఆట పట్టించడానికి " నీకేమైనా పిచ్చా!! నీ ఒక్కదాని వల్ల మంటలారవు. వచ్చి ప్రాణాలు రక్షించుకో.." అన్నాయి.
అందుకా పిట్ట " నేను ఒక్కదాన్నే కానీ, నేను పుట్టినప్పట్నించి  నన్ను ఈ అడవే పెంచింది.. దాన్ని రక్షించుకోవటం నా బాధ్యత" అంటూ మంటల వైపు ఎగిరింది.
అది చుసిన మిగతా జంతువులు సిగ్గోచ్చి అవికూడా నీళ్ళు తేచ్చి పోశాయి. కొంత సేపటికి మంటలు అదుపులోకి వచ్చాయి.అడవి రక్షించబడింది.
నీతి: 
1. మనకు సహాయం చేసిన వారికి సహాయం చేయటం మన బాధ్యత.
2. team work తో ఏమైనా సాధించవచ్చు.


కోపం ఎలా అదుపుచేస్కుకోవాలి

ఒక ఊర్లో ఒకానొక రైతు వున్నాడు. అయన కొడుకుకి  చాల కోపం ఎక్కువ. ఇది గమనించిన తండ్రి చాల ఆందోళన పడ్డాడు. చివరికి ఆయన కొడుకుకి కొన్ని మేకులిచ్చి ఒక సలహా ఇచాడు. "నీకు కోపం వచ్చిన ప్రతీ సారి ఒక మేకు మన ఇంటి ప్రహరి గోడకి కొట్టి మల్లి సుత్తి తో బయటికి లాగేయ్యాలి" అని చెప్పాడు.
మొదటి రోజు కొడుకు 29 మేకులు కొట్టాడు,
రెండో రోజు 16,
మూడో రోజు 5,
నాల్గవ రోజు కి అతనికి కోపం పూర్తిగా పోయిoది.
ఆ రోజు మేకులు కొట్టక పోవడం గమనించిన తండ్రి కొడుకుని పిలిచి..." చూడు బాబు నీ కోపం వచ్చినప్పుడు మేకుల్ని కొట్టి బయటికి తీసావు కానీ కోపం పర్యవసానం ఎలా ఉంటుందంటే మన గోడలోని చిల్లుల్లా మనుషుల హృదయాల్ని చెడగొడుతుంది. కోపం ఎలా అదుపు చెయ్యాలంటే సంయమనం పాటిస్తే కోపం చల్లారి పోతుంది"
కొడుకు అర్ధం చేసుకున్నందుకు తండ్రి సంతోషించాడు.